మల్లాదికి ఇష్టమైన రైటర్ ‘కనకమేడల’ గురించి కొన్ని కబుర్లు

ఒక తరంలో పుస్తకాల మీద ఆసక్తి కలిగించినవి డిటెక్టివ్ సాహిత్యామే అంటే చాలా మంది నమ్మరు. శవ సాహిత్యం, క్షుద్ర సాహిత్యం అంటూనే ఆ పుస్తకాలను తెగ ఆదరించారు. ముఖ్యంగా అప్పట్లో వాడేవీడు, కాళరాత్రి, మహామాయ వంటి పుస్తకాలు తెగ క్లిక్ అయ్యాయి.  అప్పట్లో వీటి ధర అర్దరూపాయి,రూపాయి ఉండేది. దాంతో కుర్రాళ్లకు అందుబాటులో ఉండేవి. డిటెక్టివ్ నవలా ప్రభంజనం రెండు దశాబ్దాలు తెలుగు వారిని ఊపేసింది. ఆ సాహిత్యం చెడు కలిగించలేదు. పఠానాశక్తిని  పెంపొందించి, ఆ తర్వాత మంచి సాహిత్యం వైపుకు మొగ్గు చూపేలా చేసింది. 

తెలుగులో ప్రధమ అపరాధ పరిశోధక నవల వాడేవీడు..రచయిత శ్రీదేవరాజు వెంకట కృష్ణారావు . అప్పట్లో డిటెక్టివ్ ని పత్తేదారు అనేవారు. ఆ తర్వాత డిటెక్టెవ్ అనటం మొదలైంది. ఆ డిటెక్టివ్ నవలలు ఎంత ప్రభావం చూపాయంటే   మహాకవి శ్రీశ్రీ సైతం డిటెక్టివ్ నవలలు రాసేటంత. 
అప్పట్లో లబ్దప్రతిష్టులైన ఎందరో సాహితీపరులు డిటెక్టివ్ నవలలు రాసారు. అవన్ని మామూలు సైజులోనే వచ్చేవి. అయితే ఇంగ్లీష్ లో వచ్చే పెర్రీ మాసన్ డిటెక్టివ్ నవలలుకు మూడు వైపులా పేజీలకు రంగులు ఉండేవి. ఆ ప్రభావంతో తెలుగులో కూడా పాకెట్ సైజు డిటెక్టివ్ నవలలు మొదలయ్యాయి.  అలా వచ్చిన మొదట నవల ఆనకట్ట మీద హత్య అని చెప్తారు. ఆ నవల రాసింది…ఆరుద్ర కావటం విశేషం.  ఆ తర్వాత ఆరుద్రగారు పలకల వెండిగ్లాసు, అణాకొక బేడ స్టాంపు వంటివి రాసారు. 


అప్పట్లో ఈ నవలలు ఆ కాలం కుర్రకారు వేలం వెర్రిగా చదివేవారు అని చెప్తారు. అలాగే కొమ్మూరి సాంబశివరావు గారి డిటిక్టివ్ నవలలు గురించి అయితే చెప్పక్కర్లేదు. అవి ఓ ఊపు ఊపాయి. కొవ్వలి రాసిన జగజ్జాణ ..25 భాగాలు సైతం ఓ అద్బుతమే. వీటితో పాటు ఆ కాలంలో ఓ మెరుపు మెరిసిన సీరిస్…  కనకమేడల రాసిన మహామాయి సీరిస్ .   మహా మాయ అనే 24 భాగాల భారీ జానపద నవల చదవటం మొదలెడితే ఆపటం చాలా కష్టం. అంత ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి వంటి ప్రముఖ రచయితలు సైతం కనకమేడల రచనలను ప్రస్తావించటం మనం గమనించవచ్చు.  అపరాధ పరిశోధనలో వరస పెట్టి నవలలు రాయటం కొత్త ఒరవడి అనే చెప్పాలి.  చాలాకాలం ఈ పుస్తకాలు ఎవరికీ దొరకలేదు కానీ ఇప్పుడు ఆన్ లైన్ లో ఈ పుస్తకాలు పీడీఎఫ్ కాపీలు దొరుకుతున్నాయి. చదవి ఎంజాయ్ చెయ్యండి.

కనకమేడల అసలు పేరు కనకమేడల వెంకటేశ్వరరావు . ఆయన గుడివాడ ప్రాంతానికి చెందిన వారు. ఆయన  విద్వాంసుడు, సత్కవి.  పద్యరచనలుసైతం చేసిన వారు. అయితే వాటిని  మానివేసి, సినిమాలలోకి దిగి హీరో కాంతారావు గారితో “విజయ ఢంకా” అని విడుదలకు నోచుకోని  చిత్రాన్ని తీసి చేతులు కాల్చుకొన్నారు. ఆ తర్వాత  సొంతంగా ఇంటి వెనకే చిన్ని ట్డ్రెడిల్ ప్రెస్సును పెట్టుకొని డిటెక్టివు కిషోర్ హీరోగా ‘ఒంటికంటి రహస్యం’, ‘మోసగించిన వీలునామా’ వంటి నవలలను రాసి, మళ్ళీ నిలదొక్కుకోగలిగారు.  మీకు ఎక్కడైనా ఆ నవలలు చదివితే వదలకండి.