టైమ్ మిషన్ ఎక్కించి జ్ఞాపకాల ప్రపంచంలో దించిన ఘనుడు

కొన్ని పుస్తకాలు చదివి వదిలేస్తాం..మరికొన్ని భధ్రంగా బీరువాల్లో దాచుకుంటాం.ఇంకొన్ని పుస్తకాలు మాత్రం మన హృదయాల్లో తెలియకుండానే దూరి, జ్ఞాపకాలుగా మారిపోతాయి. జీవితాంతం వెంబడిస్తాయి. అప్పుడెప్పుడో చదివిన ఆ పుస్తకం మళ్ళీ దొరికితే బాగుండును అని పాత పుస్తకాల షాపుల వెనకాల తిరిగేలా చేస్తాయి.  అయితే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం చదివిన పుస్తకం ఓ జీవితకాలం వెతికినా చాలా సార్లు దొరకదు. ఆ పుస్తకం గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. అలాంటి కొన్ని పుస్తకాలు తెలుగు వారి జీవితాల్లో జ్ఞాపకాలుగా మిగిలినవి ఉన్నాయి. అవి మనదేశానివికాదు..కానీ మనకి సంభందించిన పుస్తకాలే అవి..అవే సోవియట్ తెలుగు పుస్తకాలు. 
ఓ తరం మొత్తం సోవియట్ పుస్తక ప్రయాణంలో పాలుపంచుకుంది. చదువొచ్చిన  ప్రతీ ఇంట్లోనూ మినిమం ఒక్క పుస్తకం అయినా ఉండేది. ఎందుకంటే అందమైన బొమ్మలు..అద్బుతమైన అట్టలు, అంతకు మించిన కథలు, అనువాదం అయినా ఒరిజనల్ రచయితలు డైరక్ట్ గా మన తెలుగులోనే రాసినంత బాగా ఆ పదాలు ఉండేవి. ఆ పుస్తకాలు కొద్ది కాలం క్రితం వరకూ చాలా మంది వెతుక్కుంటున్న జ్ఞాపకాలే అయ్యాయి. 
అయితే ఈ  వెతుకలాటని నిశితంగా గమనించాడో ఏమో కానీ అనీల్ బత్తుల ..ఆ అందమైన జ్ఞాపకాలును కట్ట కట్టి మళ్లీ అందించాలనుకున్నాడు. అందుకోసం http://sovietbooksintelugu.blogspot.in/ పేరుతో  ఓ బ్లాగ్ పెట్టాడు. అందులో అరుదైన రష్యా  పుస్తకాలన్ని ఏర్చికూర్చాడు. ఎక్కడెక్కడవాళ్లను పట్టుకున్నాడు..ఈ లైబ్రరీలో పుస్తకాలు అందంగా సర్దేసాడు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో జనం చదువుకునేందుకు అనువుగా పీడీఎప్ ఫార్మెట్ లో పుస్తకాలను అందించాడు. పెద్దల పసి మనుస్సలను తట్టి లేపి శభాష్ అనీల్ అనిపించుకున్నాడు. సోవియట్ పుస్తక అభిమానులను  టైమ్ మిషన్ ఎక్కించి గతంలోకి గమ్మత్తుగా తీసుకెళ్లాడు.